బయట ఎండలు మండిపోతున్నాయి.. రోజురోజుకి ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంది తప్పితే తగ్గడం లేదు. ఉదయం 9 గంటల నుండి దాదాపు సాయంత్రం 6 ఎండ తీవ్రత చాలా అధికంగా ఉంది. చిన్నపిల్లలు అలాగే వృద్ధులు బయటకు వెళ్లడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక కొందరు కార్మికులైతే తప్పక బయటకు వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి. కొందరైతే చక్కగా ఏసీలల్లో కూర్చొని పని చేసుకుంటూ ఉంటారు. ఏసీల్లో కూర్చొని పని చేసుకునే వారి పని చాలా బాగుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ తక్కువ టెంపరేచర్ ఉన్న ఏసీలో నుండి ఒక్కసారిగా ఎక్కువ టెంపరేచర్ ఉన్న బయట ప్రపంచంలోకి రాగానే ఒక్కసారిగా వడదెబ్బ తగిలే అవకాశం చాలా ఉంటుంది. ఏసీలో ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక కార్మికులైతే తప్పకుండా చాలా జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.
ఈ వేసవిలో కేవలం ఎండ తాపాన్ని తగ్గించే ఆహారం మాత్రమే కాకుండా…ఎండని తట్టుకోగలిగే శక్తిని ఇచ్చే ఆహారాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎండను తట్టుకోవడానికి ఏం అవసరం ఉంటుంది అని మనం ఎవరినైనా అడిగామంటే ఏం చెబుతారు…చల్లటి నీటిని.. లేదా ఫ్రిడ్జ్ లో పెట్టిన చిల్డ్ వాటర్ ని తాగాలి అని అంటారు. ఎవరిని అడిగినా దాదాపు 90% మంది చెప్పే జవాబు ఇదే. ఎండ తాపాన్ని తట్టుకోవడానికి చల్లటి నీటిని తాగాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఈ చల్లటి నీరు వేడి నుండి ఉపశమనాన్ని కలిగించవచ్చు కానీ శరీరానికి కావాల్సిన ఖనిజాలను ఇవ్వలేదు.
ఎండలోకి వెళ్లినా సరే మన శరీరం ఆ ఎండను తట్టుకోగలగాలి అంటే శరీరానికి కొన్ని మినరల్స్ అలాగే ప్రోటీన్ చాలా అవసరం.
ముందు గా ఎండ లో కి వెళ్ళగానే నీరసం కలగకుండా ఉండాలి అంటే శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. అలా అని మాంసం వేసవి సమయంలో ఎక్కువ తీసుకోవడం ద్వారా వేడి చేస్తుంది. ఇది మరొక రోగానికి దారితీస్తుంది. కనుక ఈ వేసవి సమయంలో ప్లాంట్ బేస్ ప్రోటీన్ ని తీసుకోవడం చాలా మంచిది. చిరుధాన్యాలలో ప్రోటీన్ అధిక మొత్తంలో లభిస్తుంది. ఏ చిరుధాన్యాన్ని తీసుకున్న అందులో ఎంతో కొంత ప్రోటీన్ ఉంటుంది. కనుక ఎండలోకి వెళ్లి పని చేసేవారు ఈ చిరుధాన్యాలను తీసుకోవడం ద్వారా వారికి ప్రోటీన్ లభిస్తుంది. చిరుధాన్యాలు అన్నిటిలో కొర్రలలో అధిక ప్రోటీన్ ఉంటుంది. కనుక కొర్రలను అధిగశాతం తీసుకోవడం ద్వారా ప్రోటీన్ బాగా లభిస్తుంది.
ఎండలోకి వెళ్ళగానే చాలామందికి కళ్ళు తిరిగినట్టు అవుతుంది.. తమ చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నవారు కాస్త జబ్బు ఉన్న వారిలా మారిపోతారు. ఎక్కువ చెమట అలాగే నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఇలా అవ్వడానికి కారణం వారిలో పొటాషియం లోపం కలిగి ఉండటం. పొటాషియం శరీరంలో కావాల్సిన మొత్తంలో ఉండడం ద్వారా అలసత్వం తగ్గుతుంది. చిరుధాన్యాలలో ఈ పొటాషియం కూడా లభిస్తుంది. అన్నిటికంటే రాగులలో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. దాదాపు 538 మిల్లీ గ్రాముల పొటాషియం లభిస్తుంది. కనుక రాగులను వేసవికాలంలో ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పొటాషియం లభిస్తుంది. అంతే కాదు ఈ రాగులలో ( Finger Millet) చలువ చేసే గుణం కూడా ఉంటుంది. సాధారణంగా మనం గమనించినట్లయితే వేసవి రాగానే చాలా చలివేంద్రాలలో అంబలిని కూడా పంచుతూ ఉంటారు. అంబలి రాగి పిండితో తయారుచేస్తారు. అంబలి శరీరానికి చలువ చేస్తుంది కనుకనే మన పెద్దవారు వేసవికాలంలో అంబలిని ఆహారంలో భాగం చేసుకోమని చెబుతూ ఉండేవారు.
విటమిన్ సి కి సంబంధించిన కూరగాయలను అలాగే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా ఎండ నుండి ఉపశమనం పొందవచ్చు. నిమ్మ జాతికి చెందిన అన్ని విటమిన్ సి ని అధికంగా కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా శరీరం వెంటనే చలువ చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టం మెరుగుపరచడానికి కూడా విటమిన్ సి బాగా ఉపయోగపడుతుంది. చిరుధాన్యాలను తినే సమయంలో కొంత నిమ్మరసాన్ని అందులో కలుపుకొని తినడం ద్వారా శరీరానికి విటమిన్ సి లభిస్తుంది.
జింక్ కలిగిన చిరుధాన్యాలను కూడా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా వేడిని తట్టుకునే శక్తి మనకు లభిస్తుంది. 100 గ్రాముల సాములలో 3.7 మిల్లీగ్రాముల జింక్ లభిస్తుంది. 100 గ్రాముల ఊదలలో (Barnyard Millets) 3.1 మిల్లీగ్రాముల జింక్ లభిస్తుంది. కనుక సామలను అలాగే ఊదలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన జింకు లభిస్తుంది.
ఎండలలో బాగా పనిచేసే వారికి బాగా చెమటలు పడుతూ ఉంటాయి. చెమటల ద్వారా ఎలక్ట్రోలైట్స్ కూడా శరీరాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ కారణంగా ఎలక్ట్రోలైట్స్ యొక్క ఇమ్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది. మెగ్నీషియం ఎలక్ట్రోలైట్ యొక్క ఇమ్ బ్యాలెన్స్ ని సరిచేస్తుంది. కనుక మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా వేసవికాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు. సజ్జలను ( Pearl Millets) ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా మెగ్నీషియం లభిస్తుంది. 100 గ్రాముల సజ్జలలో 137 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. అలాగే రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి మెగ్నీషియం లభిస్తుంది. 100 గ్రాముల రాగులలో దాదాపు 200 మిల్లి గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది.
అలాగే జొన్నలు రాగులు ఊదలు ఆరికల్లో (Kodo Millets) సాధారణంగా కూలింగ్ ప్రాపర్టీ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా వాటిల్లో నుంచి లభించే ఖనిజాలతో పాటు శరీరానికి చలవ కూడా చేస్తుంది. వీటన్నిటితోపాటు నీటిని అధికంగా తీసుకోవడం కూడా చాలా అవసరం. అలా అని ఫ్రిజ్లో పెట్టిన నీటిని కాకుండా కుండల్లో నీటిని తీసుకుంటే మరీ మంచిది.
ఇలా పైన చెప్పబడిన చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా వేసవికాలంలో ఎండ కారణంగా కోల్పోయే ఖనిజాలను తిరిగి పొందవచ్చు. అలాగే ఆరోగ్యంగా ఉండవచ్చు.
© 2023 - 2024 Millets News. All rights reserved.